టెలికాం దిగ్గజానికి షోకాజు నోటీసు | Sakshi
Sakshi News home page

టెలికాం దిగ్గజానికి షోకాజు నోటీసు

Published Fri, Mar 16 2018 12:53 PM

Trai Issues Notice To Airtel For Violating Transparency Order  - Sakshi

ముంబై : దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ షోకాజు నోటీసులు జారీచేసింది. తన కస్టమర్లకు పారదర్శకత లేని, వివక్షపూరితమైన టారిఫ్‌లు అందజేస్తుందనే ఆరోపణలతో ట్రాయ్‌ ఈ నోటీసులు పంపింది. మార్చి 25 వరకు ఈ నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. కస్టమర్లు, ప్రత్యర్థ సంస్థల నుంచి ఎయిర్‌టెల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎయిర్‌టెల్‌ పారదర్శకత లేని వివక్షపూరితమైన టారిఫ్‌లను అందిస్తుందని ఫిర్యాదులు అందినట్టు ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. నెల నుంచి వీటిపై వివరాలు అందించాలని ఎయిర్‌టెల్‌కు ఆదేశాలు వెళ్తున్నాయి.

కానీ ఎయిర్‌టెల్‌ వివరాలను అందించకపోవడంతో, ట్రాయ్‌ షోకాజు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఎలాంటి రకమైన టారిఫ్‌లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తుందో వెల్లడిచేయాలని ఆదేశించింది. ఎయిర్‌టెల్‌ కూడా ఈ నోటీసులను ధృవీకరించింది. ట్రాయ్‌ ఇచ్చిన సమయం లోపల ఈ నోటీసులపై స్పందిస్తామని పేర్కొంది. ఎయిర్‌టెల్‌పై యాక్షన్‌ తీసుకునే ముందు కంపెనీ వెర్షన్‌ కూడా వినాలనుకుంటున్నట్టు రెగ్యులేటరీ తెలిపింది. రెగ్యులేటరీకి రిపోర్టు చేసిందో లేదో బట్టి కంపెనీపై చర్యలు తీసుకుంటామని ట్రాయ్‌ అధికారులు చెప్పారు.  దోపిడి పూరిత ధరల విధానంపై ట్రాయ్‌ జారీచేసిన టారిఫ్‌ ఆర్డర్‌ అనంతరం పంపిన తొలి షోకాజు నోటీసు ఇదే. ఈ నిబంధనల కింద టెల్కోలు కొంత మంది సబ్‌స్క్రైబర్లకు కొన్ని ప్రత్యేక ప్లాన్లను ఆఫర్‌ చేయడానికి వీలులేదు. 

Advertisement
Advertisement